అలనాటి సినీ తార జమున కు ‘నవరస కళావాణి’ సత్కారం

NAVARASA KALAVANI Award

“నవరస కళావాణి” బిరుదును అందుకున్న అలనాటి నటి ‘జమున’

రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా అలనాటి సినీతార జమునకునవరస కళావాణి‘ బిరుదును అందించారు. ఈ బిరుదును ప్రధానం చేస్తూ డా. టి. సుబ్బరామిరెడ్డి లలితా కళా పరిషత్ స్వర్ణ కంకణం తో సత్కరించింది. డా. టి. సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా విశాఖలోని పోర్టు కళావాణి ఆడిటోరియం లో ‘సర్వ ధర్మ సమభావన సమ్మేళనం’ కార్యక్రమం నిర్వ హించారు.

ఈ వేడుకకు ప్రముఖ సినీ తారలు బి.సరోజాదేవి, వాణిశ్రీ, ప్రభ, శారద, రాజశ్రీ, కాంచన, గీతాంజలి, జయచిత్ర, జయసుధ, జయప్రద, పరుచూరి బ్రదర్స్, గాయనీమణులు జిక్కి, సుశీల.. జమునను సత్కరించి ఆమె తో తమ కున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వీరితో పాటు ఎంతో మంది రాజకీయ ప్రముఖులు ఘంటా శ్రీనివాసరావు, కె.వి.పి.రామచంద్ర రావు, ద్రోణంరాజు శ్రీనివాసరావు, తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.

NAVARASA KALAVANI Award

అక్కడికి వచ్చిన నటీనటులంతా జమునను శాలువాలతో సత్కరించి, పూల మాలలను వేసి, పూలగుచ్చాలను అందించారు. జమున గారికి ‘నవరస కళావాణి’ బిరుదుతో పాటు పలువురు సినీ ప్రముఖులను శాలువాలతో సత్కరించారు టి. సుబ్బరామిరెడ్డి.

ఈ సందర్భంగా జమున మాట్లాడుతూ..’ తన వయసు 82 సంవత్సరాలని, 1978 లో హైదరాబాద్ లోని నిజాం కళాశాల లో జరిగిన సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ లో ఇంత మంది నటీనటులను చూశానని మళ్ళీ ఇన్నాళ్లకు ఈ వేదిక పై వారందరిని చూడటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తనకు సత్యభామ పాత్ర అంటే ఎంతో పిచ్చి అని గుర్తు చేసుకున్నారు. శ్రీకృష్ణ తులాభారం నాటకంలో సత్యభామ పాత్ర వేయగా వచ్చిన మొత్తాన్ని పేదకళాకారులకు ఇచ్చానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు’.

మంత్రి ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ..’ సుబ్బరామిరెడ్డిని చూసి ఎంతో నేర్చుకోవాలని అన్నారు. పార్టీలు, కులమతాల కు అతీతంగా ఉండే వ్యక్తి అని కొనియాడారు. తర్వాత సినీ రంగ ప్రపంచంలో సంగీత రారాజుగా కొనసాగిన సాలూరి రాజేశ్వరరావు గారి తనయుడిగా సంగీత ప్రపంచంలో కొనసాగుతున్న సాలూరి వాసుదేవ్ గారిని సుబ్బరామిరెడ్డి సత్కరించారు ..

ఇక ఈ వేడుకకు హాజరైన వారందరూ.. ఒక్కొక్కరిగా మాట్లాడుతూ వారికి జమున గారితో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. నటి బి. సరోజాదేవి మాట్లాడుతూ..’ జమున తనకు 50 ఏళ్లుగా మంచి స్నేహితురాలని, తనతో కలిసి నటించిన సినిమాలను గుర్తు చేసుకున్నారు’.

NAVARASA KALAVANI Award

నటి జయసుధ మాట్లాడుతూ..’12 ఏళ్ళ వయసులో జమునకు కూతురుగా నటించానని, ఇప్పుడు 45 ఏళ్ళ పాటు చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ మళ్ళీ ఆమె ముందుకు వచ్చి నిలబడటం ఎంతో గర్వంగా ఉందని, ఎన్నో సినిమాల్లో నటించిన జమున తనను మించి ఇప్పటివరకు ఎవరి నటన అలా ఉండదని కొనియాడారు. ఇక జయప్రదతో తాను ఎన్నో సినిమాల్లో నటించానని, మేం కలిసి ఎన్నో పాత్రలను చేశామని, ఇప్పటి సినిమాల్లో అలాంటి ఎమోషన్ కనిపించట్లేదని అన్నారు.

ఆ తర్వాత నటి జయప్రద ముందుగా సుబ్బరామిరెడ్డి గారిని శాలువాతో సత్కరించి, తాను సినిమాల్లోకి రావడానికి ప్రేరేపించిన వ్యక్తి అని కొనియాడారు. తన రాజకీయ జీవితానికి కూడా అతనే ఇన్సిపిరేషన్ అని తెలిపారు. జమున గారికి ఇలాంటి సత్కారం చేయడం గర్వంగా ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా డా. టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ..’ జమున గారు సినీ ఇండస్ట్రీకి వచ్చి 60 ఏళ్ళు కావస్తుందని, తన అందంతో, నటనతో ఎంతో మంది ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిందని తెలిపారు. విశాఖ నగరానికి కూడా సినీ పరిశ్రమను తీసుకు రావటానికి తనవంతు కృషిని చేస్తానని ఆహుతుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఇక్కడ తానో స్థూడియోను నిర్మిస్తానని’ అన్నారు.

 

Add Comment

Click here to post a comment